Simultaneous Polls: వన్ నేషన్-వన్ ఎలక్షన్ కోసం కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను (ఈవీఎం) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది.
ఈవీఎంలు తన జీవిత కాలంలో మూడు పర్యాయాలు సేవలను అందిస్తాయి. ఈ లెక్కన ప్రతీ 15 ఏళ్లకు ఒకసారి కొత్త యంత్రాలను ఉపయోగించాలని ఈసీ పేర్కొంది. అంచనా ప్రకారం.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 11.8 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జమిలి ఎన్నికల సమయంలో ప్రతీ పోలింగ్ స్టేషన్లలో లోక్‌సభకు ఒకటి, అసెంబ్లీ నియోజవర్గానికి ఒకటి చొప్పున రెండు సెట్ల ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గత అనుభవాల దృష్ట్యా..సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు(సీయూ), బ్యాలెట్ యూనిట్లు(బీయూ), వీవీ ప్యాట్ మిషన్లను అదనంగా రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకి ఒక్కో బీయూ, సీయూ, వీవీ ప్యాట్ అవసరం.
Read Also: Kerala: బీజేపీ నేత హత్యలో దోషులుగా 15 మంది నిషేధిత పీఎఫ్ఐ సభ్యులు..
ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. కనీసం ఈవీఎంలకు 46,75,100 బ్యాలెట్ యూనిట్లు , 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్ యంత్రాలు కావాలి. 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే.. ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర రూ.7900, కంట్రోల్ యూనిట్ ధర రూ.9,800, వీవీప్యాట్ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన, జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలి. వాటికి రూ. 10,000 కోట్లు ఖర్చవుతాయి.
న్యాయ మంత్రిత్వ శాఖ జమిలి ఎన్నికలపై పంపిన ప్రశ్నావళికి ఈసీ ఇలా బదులిచ్చింది. ఇవే కాకుండా అదనపు భద్రతా సిబ్బంది, EVMల కోసం మెరుగైన నిల్వ సౌకర్యాలు, మరిన్ని వాహనాల అవసరాన్ని కూడా పోల్ ప్యానెల్ నొక్కి చెప్పింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు అవసరమని కూడా పేర్కొంది. పార్లమెంటు సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83, రాష్ట్రపతి లోక్‌సభ రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172, రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 174 సవరణ అవసరం. రాష్ట్ర శాసనసభలు మరియు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ 356 సవరించాల్సిన అవసరం ఉంది.