Mamata Banerjee: కోల్‌కతాలో ఐ-ప్యాక్ ఆఫీస్, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. దాడులు జరుగుతున్న సమయంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ )అధినేత్రి అక్కడి రావడం, ఆఫీసు నుంచి ఫైళ్లను తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. దీనిపై ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. కీలకమైన పత్రాలను, ఆధారాలను మమతా, స్టేట్ పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు, అమిత్ షా కావాలని తమను టార్గెట్ చేసినట్లు మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. తమ ఎన్నికల వ్యూహాలను ఈడీ అధికారుల చేత దొంగిలిస్తున్నారని మండిపడుతోంది.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ మరో బాంబ్ పేల్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా తన వద్ద ‘‘పెన్ డ్రైవ్’’ ఉందని శుక్రవారం చెప్పింది. తనను, తన ప్రభుత్వాన్ని హద్దు దాటేలా ఒత్తిడి చేస్తే బొగ్గు స్కామ్‌లో అమిత్ షా పాత్రకు సంబంధించిన వివరాలను బయటపెడుతానని హెచ్చరించింది. తన వద్ద పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని, తన రాజ్యాంగబద్ధ పదవికి గౌరవం ఇస్తూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని, తనను ఒత్తిడి చేస్తే , అన్ని బయటపెడుతానని, దేశం మొత్తం షాక్ అవుతుందని అన్నారు. ఈ రోజు ఈడీ దాడులకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మమతా భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం, కోల్‌కతాలో ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు, కోట్ల రూపాయల హవాలా చేసిందనే ఆరోపణలపై సోదాలు జరిగాయి.