Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. రామ నవమి రోజు బీజేపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తోందని బుధవారం ఆరోపించారు. గతేడాది రామనవమి వేడుకలు హింసాత్మకంగా మారాయి, దీంతో బీజేపీ, టీఎంసీల మధ్య భారీ ఘర్షణకు దారి తీసింది. ‘‘ వారు(బీజేపీ) ఈ రోజు అల్లర్లలో పాల్గొంటారు. అల్లర్ల జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో అల్లర్ల ద్వారా ఓట్లను కొట్టగొట్టాలని చూస్తున్నారు’’ అని ఇటీవల ఎన్నికల ర్యాలీలో ఆమె ఆరోపించారు.
బుధవారం తెల్లవారుజామున, మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు అభివాదం చేస్తూ.. వేడుకల సందర్భంగా శాంతిని పరిరక్షించండని సోషల్ మీడియాలో కోరారు. అయితే, ఆమె భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు, ఇది రామనవమి పండుగను కించపరచడం, ఇతర మతపరమైన సందర్భాలలో మీరు (మమతా బెనర్జీ) శాంతి సందేశం ఇచ్చారు, కానీ ఇక్కడ మీరు మాత్రం ‘ శాంతిని కాపాడండి’ అని అడుగుతున్నారు. మంచి సందేశాన్ని ఇవ్వడానికి బదులుగా, మీరు ఇలా చేయడం ద్వారా భారతీయ మరియు సనాతన సంస్కృతిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
Read Also: Teacher: 90స్ టీమ్ నుంచి మరో నవ్వుల జల్లు.. కలర్స్ స్వాతి టైటిల్ రోల్లో ‘టీచర్’
ఇదిలా ఉంటే బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ, బీజేపీలు రామనవమి ఉరేగింపులతు నిర్వహించాయి. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో జరిగిన రామ నవమి ఊరేగింపులో బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జైశ్రీరాం నినాదాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు నిఘా ఏర్పాట్లు చేశాయి.
అంతకుముందు మంగళవారం బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. బెంగాల్‌లో రామ నవమి ఉత్సవాలను నిలిపేందేందుకు తృణమూల్ కుట్ర పన్నిందని ఆరోపించారు. గతేడాది లాగే టీఎంసీ రామనవమి ఉత్సవాలను వ్యతిరేకిస్తోందని, కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు.