Site icon NTV Telugu

Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..

Bengal Elections

Bengal Elections

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన హింసాత్మక వ్యాఖ్యలపై చట్టపరంగా కేసు పెట్టబోతున్నట్లు ఆమె శనివారం తెలిపారు. హోం మంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు ఇకపై ప్రజల్ని బాంబులు, బుల్లెట్లతో భయపెట్టలేరు, బెంగాల్ ప్రజలు వాటికి ఓట్లతో సమాధానం ఇస్తారు’’ అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడుకోలు పలకాలని, అప్పుడు టీఎంసీ గుండాలను తలకిందులుగా వేలాడదీసి దారికి తీసుకువస్తామని ఆయన అన్నారు. మొదటి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా అమిత్ షా.. టీఎంసీ గుండాలు ఏప్రిల్ 23న ఇళ్లలోనే ఉండాలని, లేకపోతే మే 4 తర్వాత ఒక్కొక్కరిని పట్టుకుని జైలులో పడేస్తామని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘‘ఒక హోం మంత్రి ఎలాంటి భాష వాడుతున్నారు? ఎన్నికల తర్వాత ప్రజలను తలకిందులుగా వేలాడదీస్తామని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఈ మనస్తత్వంతో మీరు బెంగాల్‌లో ఎప్పటికీ గెలవలేరు’’ అని అన్నారు. బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Exit mobile version