ఇండియా కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి మల్లిఖార్జున ఖర్గేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన సారథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లారు. ఎన్డీఏ మెజార్టీ తగ్గించగలిగారు గానీ.. విజయం సాధించలేకపోయారు. అనంతరం హర్యానా, మహారాష్ట్రలో జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమిని మూటగట్టుకున్నాయి. దీంతో కాంగ్రెస్ తీరుపై మిత్ర పార్టీలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ దూరం జరిగినట్లుగా సమాచారం. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇంకోవైపు పార్లమెంట్‌లో అదానీ లంచాలపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేస్తోంది. దీంతో ఇప్పటికే ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pragya Nagra: ప్రయివేట్ వీడియో లీక్.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కూటమి బాధత్యలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. 100 శాతం మమతనే న్యాయం చేయగలరంటూ ఎస్పీ నేత ఉదయవీర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఆర్జేడీ కూడా తామేమీ తక్కువ కాదంటూ.. లాలూ ప్రసాద్ యాదవ్ అయితేనే న్యాయం చేయగలరని.. ఆయనే నిజమైన ఆర్కిటెక్ట్ అని ఆర్జేడీ పేర్కొంది. ఇంకోవైపు ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇలా కూటమిలో భిన్న స్వరాలతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో మిత్రపక్షాలకు చోటు కల్పించకపోవడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు చోటు కల్పించలేదని విమర్శించారు. కూటమి భాగస్వాముల మాట విని ఉంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా కలిసి కట్టుగా ముందుకు వెళ్తారా? లేదంటే ఎవరిదారి వారు చూసుకుంటారో చూడాలి. ఇప్పటికే అపజయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరిదారి వారు చూసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవేమోనని వినికిడి.
ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..