Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ చేయాలని కోరారని ఆయన అన్నారు. నేను ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు.
యథాతథ స్థితి, మార్పు అని శశిథరూర్ మాట్లాడుతున్న రెండు అంశాలపై పీసీసీ డెలిగేట్లు(ఓటర్లు), ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఏ ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకోలేదని.. నిర్ణయం సమిష్టిగా ఉంటుందని ఖర్గే వెల్లడించారు. తాను కేవలం దళిత నాయకుడిగా పోటీ చేయడం లేదని.. ఓ కాంగ్రెస్ నాయకుడిగా పోటీలో ఉన్నానని.. నా పోరాటం కొనసాగుతుందని అన్నారు. నేను ఎప్పుడూ కూడా సిద్ధాంతం, విలువలు కోసమే పోరాటం చేశానని అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజున నా ప్రచారం ప్రారంభించానని తెలిపారు.
Read Also: Ind vs Sa: దక్షిణాఫ్రికాతో రెండో టీ20కి సిద్ధమైన భారత్.. మరి వరుణుడు కరుణిస్తాడా?
అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా నా పోరాటాన్ని సాగించానని.. మళ్లీ నా పోరాటాన్ని సాగించి.. సిద్ధాంతాలు, విలువను భావి తరాలక్ు అందివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ నేతల ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జీ-23 క్యాంపు లేదని ఖర్గే అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు నాయకులంతా కలిసి పని చేయాలనుకుంటున్నారని.. వారంతా కూడా నాకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇప్పటికే 30 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిలకు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపుగా 25 ఏళ్ల తరువాత తొలిసారిగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నాడు.