JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా వాన్స్, పిల్లలతో కలిసి భారత్ వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత సంతతికి చెందిన సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, వారి ముగ్గురు పిల్లలు – కుమారులు ఇవాన్, వివేక్ మరియు కుమార్తె మిరాబెల్ నాలుగు రోజుల భారతదేశ పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆయనను ‘‘ప్రత్యేక వ్యక్తి’’గా అభివర్ణించారు. ప్రధాని మోడీకి ఉన్న ‘‘అప్రూవల్ రేటింగ్’’ తనను అసూయపడేలా చేస్తుందని జేడీ వాన్స్ అన్నారు.
Read Also: Priyadarshi : రివ్యూలు రాయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు.. స్పందించిన ప్రియదర్శి
జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. భారతదేశం-అమెరికా ఇంధన సంబంధాల గురించి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి భారతదేశం కోసం పోరాడే ‘‘కఠినమైన చర్చించే వ్యక్తి’’, ‘‘కఠినమైన సంధానకర్త’’ అని అన్నారు. ప్రధాని మోడీ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కోసం సోమవారం విందు ఏర్పాటు చేశారు. ‘‘ నేను నిన్న రాత్రి ప్రధాని మోడీతో, మీ ప్రజామోదం నాకు అసూయను కలిగిస్తుంది అని చెప్పాను’’ అని వెల్లడించారు. తన కుమారుడు ఇవాన్ విందులోని ఆహారాన్ని ఎంతో ఇష్టపడ్డాడని, భారతదేశంలో నివసించాలని అనుకుంటున్నాడని జేడీ వాన్స్ చెప్పారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ విధింపు నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం గమనార్హం.