Sonia Gandhi: మహాత్మా గాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్ధాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం తమ పార్టీ పవిత్ర కర్తవ్యమని ఆమె చెప్పారు.
Read Also: Vikarabad: తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు కర్ణాటక బెలగావిలో జరుగుతోంది. శతాబ్ధం క్రితం ఇదే వేదికగా మహాత్మాగాంధీ కాంగ్రెస్‌కి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ హాజరుకాలేదు. ఈ సందర్భంగా లిఖితపూర్వక ప్రకటనలో రాజ్యాంగ విలువలు, గాంధీ ఆశయాలను పరిరక్షించడం పార్టీ కర్తవ్యమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బెలగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడవ్వడం పార్టీకి, స్వాతంత్ర్య ఉద్యమానికి మలుపు అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
స్వాతంత్య్రం కోసం ఎలాంటి పోరాటం చేయని సంస్థలు మహాత్మా గాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయని, ఒక విషతుల్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాయని, వీటి వల్లే ఆయన హత్య జరిగిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న వారి వల్ల గాంధీ ఘటన ప్రమాదంలో పడిందని అన్నారు. న్యూఢిల్లీలో అధికారంలో ఉన్నవారు, వారి సిద్ధాంతాలు, సంస్థల నుంచి మహాత్ముడి వారసత్వానికి ముప్పు ఉందని చెప్పారు.