Maharashtra Raigad terror boat stir: మహారాష్ట్ర రాయ్‌గడ్ లో అరేబియా తీరంలో రెండు పడవలు కలకలం సృష్టించాయి. పడవల్లో మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరేబియా తీరం హరహరేశ్వర్ తీరంలో ఈ రెండు పడవులను గుర్తించారు. బోట్ లో ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, మరికొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రాయ్‌గడ్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు పోలీసులు. పట్టుబడిన బోట్లు స్పీడ్ బోట్లు.. ఇవి యూకేలో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక ఉగ్రవాద కోణం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహరాష్ట్ర పోలీసులతో పాటు ఏటీఎస్( యాంటీ టెర్రర్ స్వ్కాడ్) ఘటన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ముంబై తరహా దాడికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్
గణేష్ ఉత్సవాలు దగ్గరకు వస్తున్న క్రమంలో ఈ పడవలు వెలుగులోకి రావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రత్యేక విచారణ జరపాలని.. రాయ్‌గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే కోరారు. శుక్రవారం దహీ హండీ, కృష్ణాష్టమి పండగలు ఉండటంతో పాటు మరో 10 రోజుల్లో వినాయక చవితి, గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న క్రమంలోొ ఇలా అరేబియా తీరంలో మారణాయుధాలతో బోట్లు దొరకడంతో ఒక్కసారిగా మహా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ రెండు బోట్లు దొరికిన ప్రాంతం ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయ్ గడ్ ఎస్పీ అశోక్ దూధే, ఇతర పోలీస్ అధికారులు రెండు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చుట్టుపక్కట జిల్లాలను మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు.
2008, నవంబర్ 26న ఇలాగే పాకిస్తాన్ నుంచి ముంబై తీరానికి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఏకంగా మూడు రోజుల పాటు ముంబై మహానగరాన్ని వణికించారు. నారిమన్ హౌజ్, తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ పై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 175 మంది సాధారణ ప్రజలు, పోలీసులు చనిపోయారు.