Rakesh Jhunjhunwala: కొంత మంది వ్యక్తులను కారణజన్ములంటారు. ఎందుకంటే వాళ్లు ఆయా రంగాలపై చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. అలాంటివారిలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఒకరు. షేర్ల విలువలు రోజుకొక రకంగా మారిపోయే స్టాక్ మార్కెట్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి నమ్మశక్యంకాని విజయాలను సొంతం చేసుకున్నారు. ఒక్క రోజే ఏకంగా 875 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.
రూ.5 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో కెరీర్‌ని ప్రారంభించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ రూ.46,000 కోట్ల సంపదను సృష్టించారంటే షేర్ మార్కెట్‌పై ఆయన ఎంత పట్టు సాధించారో అర్థంచేసుకోవచ్చు. అందుకే.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాని ఇండియన్ వారెన్ బఫెట్ అంటారు. బిగ్ బుల్ అంటూ స్టాక్ మార్కెట్ పరిభాషలోనూ పిలుస్తారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌లో భారీగా లాభాల పంట పండించటమేకాకుండా ‘కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్’ అనే కీర్తిప్రతిష్టలనూ సంపాదించారు.
ఇండియా మొత్తం ఇలా ఫేమస్ అయిన ఆయన 1960లో మన హైదరాబాద్‌లోనే పుట్టడం మనకు గర్వకారణమని చెప్పొచ్చు. అయితే.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కుటుంబం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వెళ్లింది. సిండెన్‌హామ్ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1985లో సీఏ పూర్తి చేశారు. అదే సంవత్సరం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ముందుగా టాటా టీ కంపెనీ వాటాలను కొనుగోలు చేశారు.
ఏడాది తిరిగే సరికి ఆ షేర్ల విలువ మూడున్నర రెట్లు పెరిగింది. దీంతో అనూహ్యంగా 5 లక్షల రూపాయల లాభం వచ్చింది. 2017లో టైటాన్ సంస్థ షేర్ వ్యాల్యూ అమాంతం పెరగటంతో ఒక్క రోజులోనే 875 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పటికీ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని మోస్ట్ వ్యాల్యుబుల్ లిస్టెడ్ హోల్డింగ్ టైటానే కావటం విశేషం. ఆయనకు స్టాక్ మార్కెట్‌పై ఎంత గ్రిప్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు బోల్తా కొట్టిన సందర్భాలూ ఉన్నాయి.
2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యంతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా షేర్ల విలువ 30 శాతం పతనమైంది. తిరిగి కోలుకోవటానికి 4 సంవత్సరాలు పట్టింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పైన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విచారణ జరిపింది. గతేడాది 35 కోట్ల రూపాయలు చెల్లించాక ఎట్టకేలకు ఈ ఇష్యూ సెటిలైంది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన పెట్టుబడులను స్టాక్ మార్కెట్‌కి మాత్రమే పరిమితం చేయలేదు.
Adani Group: దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ కంపెనీ అరుదైన ఘనత
బాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు. ఇంగ్లిష్ వింగ్లిష్, షమితాబ్, ‘కీ అండ్ కా’ అనే 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తర్వాత.. పోషకాహారం, విద్య తదితర రంగాల్లోకి ప్రవేశించారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన సంపదలోని 4వ శాతాన్ని సామాజిక సేవకు కేటాయించారు. తండ్రి కోరిక మేరకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకునేవారు. గతేడాది ఆకాశ ఎయిర్ లైన్స్ ఏర్పాటులో సహవ్యవస్థాపకుడిగా ఉన్నారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లైఫ్ జర్నీపై ఒక పాపులర్ బ్లాగ్ నడిచేది. దాని పేరు ”ది సీక్రెట్ జర్నల్ ఆఫ్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా”. ఆయనపై ఒక నవల కూడా వచ్చింది. ”హౌ టు బికం బిలియనీర్ బై సెల్లింగ్ నథింగ్’’ అనేది ఆ నవల పేరు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్ స్టోరీని చమత్కారంగా చెప్పారు. స్టాక్ మార్కెట్ల తీరును మహిళల వ్యవహార శైలితో పోల్చారు. షేర్ మార్కెట్లు స్త్రీల మాదిరిగా ప్రవర్తిస్తాయి.
మన మీద ఎప్పుడూ కమాండింగ్ చేస్తూ ఉంటాయి. ఎంత పరిశోధించినా ఒక పట్టాన అర్థంకావు. క్షణక్షణం ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తాయి. ఈ అభిప్రాయంతో లేడీస్ కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నా” అంటూ సరదాగా ముగించారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భోజన ప్రియుడు. దోశలు బాగా లాగిస్తారు. చైనీస్ ఫుడ్డుకి ఆయన వీరాభిమాని. అలాగే.. గుర్రపు పందేలను ఎంతో ఇష్టంగా చూసేందుకు రోజూ మహాలక్ష్మి రేస్ కోర్స్‌కి వెళ్లేవారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకి స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అదే పనిగా పొగతాగేవారు. భారత స్టాక్ మార్కెట్ ముద్దుబిడ్డ అంటూ మదుపరులు అభిమానంగా పిలుచుకునే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 62 సంవత్సరాల వయసులోనే అకాల మరణం చెందటం యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఎన్-బిజినెస్ ఘన నివాళులర్పిస్తోంది.