మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా విడుదల చేశారు ఎమ్మెల్యేలు. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ఎమ్మెల్యేల మనోభావాలను పట్టించుకోలేదని సంచనల వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఈ అంశంపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా సీఎంతో చర్చించాలని.. ఎమ్మెల్యేల అభీష్టం మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలగడమే అంటే అందుకు సిద్ధంగా ఉన్నామని.. అయితే వారు గౌహతి నుంచి కాకుండా ముంబై వచ్చి సీఎంతో చర్చించాలని సూచించారు. ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ సీఎం అధికార నివాసం ‘ వర్ష బంగ్లా’కు తిరిగి వస్తారని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారని, గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేల్లో 18 మంది కూడా తమతో టచ్ లో ఉన్నారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ అన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే క్యాంప్ లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 35 మంది ఎమ్మెల్యేలు శివసేనకు సంబంధించిన వారు కాగా.. మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంప్ పెట్టారు. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం కూలిపోకుండా, బీజేపీ చేతిలోకి అధికారం వెళ్లకుండా శరద్ పవార్ మంతనాలు సాగిస్తున్నారు.