మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితులు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది. చివరికి బీజేపీనే.. ఆ పీఠాన్ని దక్కించుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్… సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయిష్టంగానే ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఫడ్నవిస్ కేబినెట్ కూర్పు చేస్తున్నారు. ఇందుకు హైకమాండ్ పెద్దలను కలిసేందుకు బుధవారం హస్తినకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ను కలిశారు. అమిత్ షాతో మంత్రివర్గంపై చర్చించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. శివసేన నేత షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. ముంబైలోనే ఉన్నారు. అయితే శివసేన హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా సమాచారం. కానీ హోంశాఖను ఇచ్చేందుకు ఫడ్నవిస్ సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. హోంశాఖను తన దగ్గరే పెట్టుకోవాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మంత్రి పదవులపై బీజేపీ, ఎన్సీపీ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. శివసేన విషయంలోనే ఇంకా పంచాయితీ తెగనట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి 22, శివసేనకు 11, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. మొత్తం మహారాష్ట్రలో గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. అయితే శివసేన కీలకమైన ఫోర్ట్‌పోలియోను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అవి ఇచ్చేందుకు మాత్రం ఫడ్నవిస్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతోనే మహాయుతిలో మరోసారి తీవ్ర పంచాయితీ సాగుతోంది. హోంశాఖతో పాటు రెవెన్యూను తన దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. శివసేనకు అర్బన్ డెవలప్‌మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఎన్సీపీకి మాత్రం ఫైనాన్స్ కేటాయించే అవకాశం ఉంది.
డిసెంబర్ 16 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమావేశాలకు రెండు రోజుల ముందే మంత్రివర్గ విస్తరణ చేయాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. డిసెంబర్ 14నే ఈ కార్యక్రమం ముగించాలని అనుకుంటున్నారు. కానీ ఫోర్ట్‌పోలియోపై పంచాయితీ తెగకపోవడంతో ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహాయుతి భారీ విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.