Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది. మహాయుతి కూటమిలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలకు రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని, ఈ మేరకు ఫార్ములా రెడీ అయినట్లు సోర్సెస్ చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ మహాయుతి కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మహావికాస్ అఘాడీ(ఏంవీఏ) దారుణంగా ఓడిపోయింది. అయితే, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 40 మంది వరకు క్యాబినెట్‌లో మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో సగం బీజేపీకి, మిగతావి రెండు భాగస్వామ్య పక్షాల మధ్య పంచుతారనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.