Ajit Pawar: రాజకీయాలను ఇళ్లలోకి రానీవ్వకూడదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేకి వ్యతిరేకంగా తన భార్య సునేత్రా పవార్‌ని పోటీకి దింపడం ద్వారా తప్పు చేశానని అన్నారు. “నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తున్నాను. రాజకీయాలను ఇంట్లోకి రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపడం నేను తప్పు చేశాను. ఇది జరగకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్‌సిపి) నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను. ” అని ఆయన అన్నారు.
Read Also: AP High Court: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘జన్ సమ్మాన్ యాత్ర’ ద్వారా అజిత్ పవార్ మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే ఆర్థిక సాయం ‘ముఖ్యమంత్రి లాడ్కీ బహన్ యోజన’ను ప్రచారం చేస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకి వ్యతిరేకంగా బారామతి నుంచి సునేత్ర పవార్‌ని బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలే గెలుపొందింది. ఆ తర్వాత పరిణామాల్లో సునేత్ర పవార్‌ని రాజ్యసభకు పంపారు. గతేడాడి ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)ల కూటమి ‘మహాయుతి’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి.