ఆన్‌లైన్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే చాలా ముందుకు సాగినప్పటికీ, సైబర్ మోసాల కేసులు పూర్తిగా పెరిగాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఒకపైసా కారణంగా సైబర్ వల నుంచి బయటపడ్డాడు. గ్రేటర్ నోయిడాలోని డారిన్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 9,999.99 ఉన్నందున రూ. 10,000 ఆన్‌లైన్ మోసం నుండి రక్షించబడ్డాడు. ఈ సంఘటన జూన్ 2న జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సునీల్ కుమార్ తన బంధువులలో ఒకరికి రూ. 22,000 బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే, అతను పొరపాటున తప్పుగా ఖాతా నంబర్‌ను నమోదు చేయడంతో ఏదో తెలియని ఖాతాలో మొత్తం జమ చేయబడింది. దీంతో లోపాన్ని గ్రహించిన సునీల్ కుమార్ వెంటనే తన బ్యాంక్‌కు తెలియజేసారు. కానీ ఎటువంటి సహాయం అందలేదు, దాని తర్వాత అతను ట్విట్టర్‌లోకి వెళ్లి బ్యాంక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా సహాయం కోసం అడిగాడు. అయితే.. సైబర్ నేరగాళ్లు కుమార్ ట్వీట్‌ను గుర్తించి, వెంటనే అతనిని సంప్రదించి అతని ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసేలా చేశారు.
దాని ద్వారా అతనిని తప్పుదారి పట్టించి కుమార్ బ్యాంక్ వివరాలను పొందారు. అంతేకాకుండా. మొదట రూ. 2,000 లావాదేవీని ప్రారంభించారు కానీ విఫలమయ్యారు. అనంతరం, వారు 10,000 లావాదేవీని చేశారు. కానీ.. సునీల్ బ్యాంక్ ఖాతాలో రూ. 9,999.99 మాత్రమే ఉన్నందున అతనికి బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సునీ కుమార్ అతను సైబర్ క్రైమ్ బాధితుడని గ్రహించి వెంటనే నోయిడా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు.