Congress: అరవింద్ కేజ్రీవాల్‌ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
Read Also: Delhi Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..? ఎవరెవరు అరెస్ట్..?
కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. ‘‘ లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ని లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేయడం ప్రధాని నరేంద్రమోడీకి, ఆయన ప్రభుత్వానికి తగదని ఆమె అన్నారు. ఎన్నికల సమరంలో మీ విమర్శకులతో పోరాడండి, వారిని ధైర్యంగా ఎదుర్కొండి, వారి విధానాలను, పనితీరుపై దాడి చేయండి, ఇది ప్రజాస్వామ్యం అవుతుంది, కానీ ఈ విధంగా ఒకరి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి దేశంలోని అన్ని సంస్థల శక్తిని ఉపయోగించి ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆమె అన్నారు.
మరో కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం మాట్లాడుతూ..ఇది పూర్తి ఫాసిజంగా అభివర్ణించారు. ఇద్దరు సిట్టింగ్ సీఎంలను లోక్‌సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఆయుధంగా చేస్తున్నారని, ప్రజలు దేశాన్ని రక్షించుకుంటారా..? అని ట్వీట్ చేశారు. ఎన్సీపీ(శరద్ పవార్).. కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షాలను, ఇండియా కూటమిలోని నేతల్ని కేంద్ర ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో చెప్పారు.