Love Jihad Is New Form Of Terrorism Says Union Minister Giriraj Singh: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ‘లవ్ జిహాద్’ అనే కొత్తం రూపం దాల్చిందని బాంబ్ పేల్చారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ వర్ధంతి సందర్భంగా మహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేసేందుకు మురికి కుట్ర పన్నుతోందన్నారు. ఆ కుట్రను భగ్నం చేయాలంటే.. మనమంతా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. బిహార్‌లో మత మార్పిడులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఆరోపించారు. మహాగట్ బంధన్ ప్రభుత్వం కేవలం తన ముస్లిం ఓటు బ్యాంకు గురించే ఆందోళన చెందుతోందని, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పునరుద్ధాటించారు. సీమాంచల్ (నేపాల్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులు) ప్రాంతంలో అయితే పరిస్థితి మరీ తీవ్రంగా ఉందని.. ఆ జిల్లాల్ని సందర్శిస్తే, బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించామా? అనే సందేహాలు కలుగక మానదని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన బెగుసరాయ్‌తో పాటు బిహార్‌లోని ఇతర జిల్లాల్లో కూడా క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గిరిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కూడా గిరిరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ యాత్ర హిందూ ద్వేషులను ఏకం చేయడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన భారత్‌ను ఏకం చేస్తున్నాడా లేదా హిందువులపై ద్వేషంతో నిండిన ‘తుక్డే-తుక్డే’ ముఠా, క్రైస్తవ మతగురువులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాడా? అని ప్రశ్నించారు. తనను నాశనం చేసేందుకు మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తన సొంత పార్టీనే నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు? అని చురకలంటించారు. అలాగే, జనాభా నియంత్రణ చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. ఇటువంటి విధానాలు దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. చైనాలో నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుంటే, మన దేశంలో నిమిషానికి 31 మంది పిల్లలు పుడుతున్నారని.. దీని కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధి వేగంగా జరగలేదని అన్నారు. ముస్లిం సమాజంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని.. అయితే రాడికల్ కరడుగట్టినవారు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.