మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ వివాదం ముదురుతోంది. ఈ నెల మొదట్లో ముంబై శివాజీ పార్కులో జరిగిన భారీ ర్యాలీలో ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన సంచలన ప్రకటనతో వివాదానికి తెరలేచింది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లను నిషేధించాలన్న ఆయన డిమాండ్ చుట్టూ నేడు మహా రాజకీయం తిరగుతోంది. లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు రాజ్ ఠాక్రే డెడ్‌లైన్ కూడా విధించారు. మే 3లోగా వాటిని తీసివేయకపోతే మసీదుల బయట బిగ్గరగా హనుమాన్ చాలీసా వినిపిస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దాంతో, గడువు సమీపించే కొద్ది లౌడ్‌స్పీకర్లు..హనుమాన్ ఛాలీసా చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.
మరోవైపు, రాజ్ ఠాక్రే హెచ్చరికలపై శివసేన మండిపడుతోంది. మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటంలో విఫలమైన బీజేపీ తీవ్ర నిరుత్సాహంతో కుట్రలకు పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎన్‌ఎస్ తో కలిసి బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అంతేకాదు రాజ్ థాకరే పార్టీని నవ హిందూత్వ ఎంఐఎంగా, ఆయనను నవ ఒవైసీ అని రౌత్ అభివర్ణించటం పరిస్థితికి అద్దంపడుతోంది. మతం పేరుతో జనం మధ్య చిచ్చుపెట్టి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిర పరచి తద్వారా రాష్ట్రపతి పాలన విధించే కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపిస్తోంది.
మరోవైపు, రాజ్ ఠాక్రే ప్రకటనలు ఆయన సొంత పార్టీలో కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. ముస్లిం నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ధానిక నేతలు పార్టీని వీడటం కలకలం రేపింది. ముంబై, మరాఠ్వాటా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముస్లిం నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ డైరెక్షన్‌లో రాజ్ ఠాక్రే హిందుత్వ అంశాన్ని భుజానికి ఎత్తుకోవటమే వారి రాజీనామాలకు కారణమని సామాచారం.
లౌడ్ స్పీకర్ల తొలగింపుపై పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వెనక్కి తగ్గకపోవటంతో తాను పార్టీ నుండి వైదొలిగినట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ప్రకటించాడు. ఆయన తన రాజీనామా లేఖను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. గత 10 రోజుల్లో దాదాపు 50 మంది ఎమ్‌ఎన్‌ఎస్ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి, గత అసెంబ్లీ ఎన్నికలలో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆసెంబ్లీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారం పంచుకునే విషయంలో పేచీ వచ్చింది. శివసేనకు సీఎం పదవి ఇవ్వటానికి బీజేపీ నిరాకరించింది. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీపీతో జట్టు కట్టి ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. మరోవైపు, ఒకప్పుడు శివసేనలోనే ఉన్న రాజ్‌ఠాక్రే పార్టీలో పడకపోవటంతో బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. మరాఠీల హక్కుల రక్షణే దాని ప్రధాన ఎజెండా.
ఎమ్‌ఎన్‌ఎస్ గత పదేళ్ల నుంచి క్రమంగా ప్రజాకర్షణ కోల్పోతోంది. 2009 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో ఆ పార్టీ బలం 13 నుంచి 1కి పడిపోయింది. దాంతో తిరిగి రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా రాజ్ ఠాక్రె తన కాషాయ అజెండాతో బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నట్టు పరిశీలకు భావిస్తున్నారు.
Read Also: Raj thackeray: ముస్లింలు గమనించాలి… చట్టం కంటే మతం పెద్దది కాదు
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలోని రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లి కలిశారు. ఐతే అది తమ కుటుంబ సమావేశమని, అందులో రాజకీయంగా ఏమీ లేదని నితిన్ గడ్కరీ తరువాత చెప్పారు. కానీ, ఈ భేటీ వెనుక ఏదో రాజకీయ ఎజెండా ఉందని అంతా అనుకున్నారు. కనుక, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ భేటీ వెనక పరమార్థం ఏమిటో అర్థమవుతుంది.
గడ్కరీతో భేటీ తరువాత కొద్ది రోజులకే ఉద్ధవ్ ఠాక్రేపై రాజ్ ఠాక్రేపై నేరుగా దాడి ప్రారంభించారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తన హిందుత్వంపై ప్రేమను చాటుకుంటున్నారు. మరాఠాల నూతన సంవత్సరల వేడుకల గుడిపడ్వా సందర్భంగా మసీదులపై ఉన్న మైకులను తొలగించాలనటం కూడా ఆ ప్రేమలో భాగమే అని విమర్శకులు అంటున్నారు. హిందూత్వ కోసం రాజ్ థాకరే చేస్తున్న తాజా హడావుడి భారతీయ జనతా పార్టీకి కూడా లాభిస్తుంది. మరాఠా ఓటర్లలో కొంత భాగాన్ని అధికార కూటమికి దూరం చేయాలంటే ఇప్పుడు బీజేపీకి ఎమ్‌ఎన్‌ఎస్ అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రాజ్‌ఠాక్రే హెచ్చరికలను మహా సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఆవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. దాంతో మహారాష్ట్రలో ఏం జరగనుందనే దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.