Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కీచక ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు ఏకంగా రక్తంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. యూపీ ఘజియాబాద్లో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండేపై సీఎంకి అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కీచక ఉపాధ్యాయుడి నుంచి తమకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.
విద్యార్థినుల నుంచి తీవ్ర ప్రతిస్పందన రావడంతో ప్రిన్సిపాల్ ని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ప్రిన్సిపాల్ రాజీవ్ పాండే సాకులతో బాలికను తన కార్యాలయానికి పిలిపించుకుని అసభ్యంగా శరీరాన్ని తాకేవాడు. బాధిత విద్యార్థినులంతా 12 నుంచి 15 ఏళ్ల లోపు వారే. అయితే ప్రిన్సిపాల్ కు భయపడి ముందుగా ఎవరికి చెప్పలేదు. చివరికి బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: K.Raghavendra Rao: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దర్శకేంద్రుడు
ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు సీఎం యోగికి రక్తంతో లేఖ రాశారని పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్ అకృత్యాల గురించి తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు అతనితో గొడవ పడినట్లు లేఖలో రాశారు. ప్రిన్సిపాల్ తో వాగ్వాదం జరగింది, కోపంగా ఉన్న తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. అయితే తనపై దాడి చేసినందుకు విద్యార్థినుల తల్లిదండ్రులపై కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశాడు సదరు ప్రిన్సిపాల్. ఇరు వర్గాల కేసులను పోలీసులు కేసు నమోదు చేశారు.
తమను పోలీసులు బెదిరించి గంటల తరబడి నిర్భంధించారని విద్యార్థినుల, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోవాల్సి వచ్చిందని, లేఖలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందిన వాడు కావడంతోనే అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని లేఖలో ఆరోపించారు. మేమంతా మీ కుమార్తెల వంటి వారమని, మిమ్మల్ని కలిసి, తమపై జరిగిన వేధింపుల గురించి వ్యక్తిగతంగా చర్చించాలని అనుకుంటున్నామని లేఖలో తెలిపారు.