మహారాష్ట్రలో దారుణం జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న మహిళపై చిరుతపులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. పూణెకు సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ పొలంలో పని చేస్తుంది. సోయాబీన్ పొలంలో పని చేస్తుండగా మాటు వేసిన చిరుత పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. దాదాపు 100 అడుగుల దూరం లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: AAP: ఆప్ సంచలన ప్రకటన.. ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి
చిరుత పులుల సంచారంపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారి తెలిపారు. చెరుకు పొలాలను పులులు నివాసంగా చేసుకుంటాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పింప్రి-పెంధార్, ఇతర ప్రాంతాల్లో 40 బోనులు, 50 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. చిరుతపులిని గుర్తించడానికి థర్మల్ డ్రోన్‌లను సైతం ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Congress: ‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..