Mallikarjun Kharge: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను దేశంలో నిషేధించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడాన్ని నిషేధించాలని అన్నారని ఖర్గే గుర్తు చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే శుక్రవారం అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చారు.
కర్ణాటకలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నియంత్రించింది. అయితే ఈ చర్యల్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేయకూడదని సర్దార్ పటేల్ గతంలో అన్నారు. జూలై 9, 2024న మోడీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిషేధాన్ని తిరిగి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము’’ అని ఖర్గే అన్నారు.
Read Also: H-1B visa: “భారతదేశం అమెరికన్ కలల్ని దొంగిలిస్తోంది”.. ట్రంప్ సర్కార్ ఆరోపణ..
1948లో ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకుందని, స్వీట్లు పంచిందని, దీని తర్వాత ఆర్ఎస్ఎస్‌పై ప్రభుత్వ బ్యాన్ విధించిందని ఖర్గే అన్నారు. పటేల్‌కు అందిన నివేదిక ప్రకరాం, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ భావజాలం కారణంగా దేశంలో ఏర్పడిన వాతావరణమే గాంధీ హత్యకు కారణమైందని ఖర్గే చెప్పారు.
అయితే, ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ 50 ఏళ్లుగా పటేల్ సేవల్ని విస్మరించిందని, ఆయన సహకారాన్ని తక్కువ చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన అడుగుజాడల్ని అనుసరించలేదని, ఆర్ఎస్ఎస్‌ను వ్యతిరేకించడానికి సర్దార్ పేరును ఉపయోగిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.
‘‘ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. అది ఇండియన్ నాజీ కాంగ్రెస్. కాంగ్రెస్ కుట్రలు అన్నీ ఉన్నప్పటికీ, కోర్టు RSSపై నిషేధాన్ని ఎత్తివేసింది. RSS ఒక రాజకీయేతర సంస్థ అని, ప్రభుత్వ ఉద్యోగులు వారి కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని వారు చెప్పారు. కానీ కాంగ్రెస్ చాలా అసహనంగా ఉంది, వారు PFI, SDPI, MIM అల్లర్లకు మద్దతుగా నిలుస్తారు కానీ దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న RSSపై విషం కక్కుతున్నారు’’ అని ఆయన అన్నారు.