India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చి చంపిన తర్వాత ఇండియా, కెనడాల మధ్య దౌత్యసంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగా భారత వ్యతిరేక శక్తులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మద్దతు తెలుపుతున్నాడు. ఇదిలా ఉంటే టొరంటోలో ఖల్సాడే కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని ట్రూడో హాజరైన సమయంలో పెద్ద ఎత్తున ‘‘ఖలిస్తాన్ నినాదాలు’’ చేయడం వివాదాస్పదమైంది. సిక్కు సమాజానికి అండగా నిలుస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
అయితే, దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో కేంద్రం సోమవారం కెనడా డిప్యూటీ హైకమిషన్‌ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిచింది. కెనడా రాయబారికి భారత్ తన ఆందోళనని తెలియజేసింది. ‘‘ఇది వేర్పాటువాదం, తీవ్రవాదం మరియు హింసకు కెనడా రాజకీయ స్థలాన్ని ఇవ్వడాన్ని మరోసారి వివరిస్తోంది. వారి నిరంతర వ్యక్తీకరణలు భారతదేశం-కెనడా సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా, కెనడాలో దాని స్వంత పౌరులకు హాని కలిగించే విధంగా హింస మరియు నేరపూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి’’ అని భారత్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
రాబోయే ఎన్నికల్లో ఖలిస్తాన్ ఓటర్లను ఆకర్షించేందుకు టొరంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలైన లిబరల్, కన్జర్వేటివ్, ఎన్డీపీ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ట్రూడో తన ప్రసంగంలో సిక్కు సమాజ హక్కులు మరియు స్వేచ్ఛలను అన్ని విధాలుగా కెనడియన్ ప్రభుత్వం పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు. ఖల్సా డేని వైసాకి అని పిలుస్తారు, ఇది సిక్కుల నూతన సంవత్సర వేడుకలను సూచిస్తుంది. గతంలో నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.