Kerala Nurse: దేశం కాని దేశంలో కేరళకు చెందిన నర్సుకు మరణశిక్ష పడింది. యెమెన్ దేశంలో అక్కడి పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో భారత్‌కి చెందిన నిమిషా ప్రియకు మరణశిక్ష విధించబడింది. అయితే తాజాగా మరణశిక్ష అప్పీల్‌ని అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మరణశిక్ష ఖాయంగా కనిపిస్తోంది. ప్రియా తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో దోషిగా నిర్థారించడంతో మరణశిక్ష విధించబడింది. చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థనను కూడా అక్కడి యెమెన్ న్యాయస్థానం తిరస్కరించింది.
అయితే తన కూతురు ప్రాణాల కోసం ఆమె తల్లి పోరాడుతోంది. తనకు యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టును కోరింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం కేంద్రాన్ని కోరింది. అయితే అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి యెమెన్ వెళ్లేందుకు భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది.
Read Also: Jay Shah: జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు.. ఆ విషయంలోనే..!
నర్సు ప్రియా కేసు కథ:
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియా కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్ వెళ్లింది. 2014లో ఆమె భర్త, కూతురు తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే నిమిష మాత్రం ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయింది. ఆ దేశానికి చెందిన తలాల్ మహ్దీ సాయంతో అక్కడే ఓ క్లినిక్ ప్రారంభించింది. కాగా కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నిమిష ప్రియను అతను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. తన పాస్ పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో నిమిష అతనికి మత్తుమందు ఇచ్చింది. ఇది ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. ఏం చేయాలో తెలియక హత్య విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. నాలుగు రోజుల తర్వాత వారి నేరం బయటకు రావడంతో ఇద్దర్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో యెమెన్ కోర్టు నిమిష ప్రియకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Read Also: Team India: ఫైనల్స్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా..
ఒక్కటే మార్గం అదే ‘బ్లడ్ మనీ’:
ప్రియా విడుదల కోసం ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ అనే బృందం 2022లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నిమిషను రక్షించేందుకు హత్య కాబడిన వ్యక్తి కుటుంబంతో చర్చలు జరిపేందుకు వీలుగా దౌత్యపరమైన జోక్యాన్ని కోరింది. సాధారణంగా ముస్లిం దేశాల్లో హత్యలకు పాల్పడిన వ్యక్తుల మరణశిక్షకు క్షమాభిక్ష పెట్టే హక్కు బాధిత కుటుంబానికి మాత్రమే ఉంటుంది. వారు క్షమిస్తేనే మరణశిక్ష నుంచి బయటపడగలం.
ఇప్పుడు కేరళ నర్సు ఆమెను విడుదల చేయడానికి ‘బ్లడ్ మనీ’ ద్వారా మహదీ కుటుంబ సభ్యులతో చర్చలు జరపాలంటే నిమిష ప్రియా తల్లి యెమెన్ వెళ్లాలి. మరణానికి తగిన పరిహారం ఇవ్వడాన్ని బ్లడ్ మనీగా వ్యవహరిస్తుంటారు. ప్రియాను రక్షించడానికి “బ్లడ్ మనీ” గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆర్డర్ జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది, అయితే ఆమె దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.