కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేరళలోని కొల్లాం కోర్ట్ ఆదేశించింది.
వైద్య విద్యార్థి విస్మయ 2019 మే 19న అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు. కట్నంగా 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, 10 లక్షల కారును ఇచ్చారు. అయితే తనకు కారు నచ్చలేదని.. మరో 10 లక్షలు ఇవ్వాలని, అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారు. ఇంత కట్నం ఇచ్చినా.. అదనపు కట్నం కోసం విస్మయను ప్రతీ రోజు వేధింపులకు గురి చేశాడు కిరణ్ కుమార్. ఈ నేపథ్యంలో విస్మయ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ గతేడాది జూన్ లో ఇంట్లో శవమై కనిపించింది. కేసును విచారించిన కొల్లాం కోర్ట్ మే 23న శిక్షను ఖరారు చేసింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జ్ సుజిత్ కేఎన్ తీర్పును వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ లోని వరకట్న నిషేధ చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం కోర్ట్ కిరణ్ కుమార్ ను దోషిగా నిర్ణయించింది. కోర్టు ముందు హాజరైన కిరణ్ కుమార్ తరపు న్యాయవాది… అతని తల్లిదండ్రులు వృద్ధులని, ఒంటరిగా ఉంటున్నారని.. అతనికి శిక్ష విధించే ముందు వారి వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ, శిక్షలో సడలింపును కోరారు.అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం కిరణ్ కు జీవిత ఖైదు విధించాలని కోరారు. దీంతో కోర్ట్ పదేళ్లు జైలు శిక్ష విధించింది.