Kerala CM Pinarayi Rejects Governor Arif Demands: కేరళ గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్ర యూనివర్సిటీలకు వీసీల నియామకం విషయంలో.. గవర్నర్ ఆరిఫ్ మమ్మద్ ఖాన్, పినరయి మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేవని ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ తొలుత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారానికి కల్లా తనకు రాజీనామాలు సమర్పించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆ నోటీసులకు వీసీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపాద్రిక్తుడైన గవర్నర్.. షోకాజ్ నోటీసులు పంపించారు. ఆ హోదాల్లో వీసీలకున్న చట్టబద్ధమైన హక్కును ఆ నోటీసుల్లో ప్రశ్నించడంతో పాటు.. నవంబరు 3వ తేదీలోపు బదులు ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం పినరయి అప్పుడు తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని కుండబద్దలు కొట్టారు.
తాజాగా ఈ వ్యవహారంలో ఆర్థికమంత్రి కే. బాలగోపాల్ జోక్యం చేసుకోవడంతో.. ఆ వివాదం మరింత ముదిరింది. అక్టోబర్ 18వ తేదీన యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన వారు (గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ని ఉద్దేశిస్తూ) కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న గవర్నర్.. సీఎంకు లేఖ రాశారు. బాలగోపాల్ వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. బాలగోపాల్ తన విశ్వాసం కోల్పోయారని, రాజ్యాంగబద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎంకి సూచించారు. ఇందుకు సీఎం పినరయి బదులిస్తూ.. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే.. తనకు ఆర్థికమంత్రిపై ‘అచంచలమైన విశ్వాసం’ ఉందని కౌంటర్ ఇచ్చారు.