బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం అని.. సరైన సమయంలో గళం ఎత్తారని కేసియార్‌కు మద్దతు ఇచ్చారు ఉద్ధవ్ థాక్రే. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం తప్పదన్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సియం కేసియార్‌తో ఫోన్లో మంతనాలు చేశారు. మత తత్వ శక్తులమీద పోరాటం చేయాల్సిందేనని.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే సియం కేసియార్ బెంగుళూరు వెళ్లి దేవెగౌడతో కూడా సమావేశం కానున్నారు. 2019 ఎన్నిల సమయంలోనూ కేసియార్ దేవగౌడతో చర్చించారు. జనతాదళ్ అధ్యక్షుడిగా, ప్రధానిగా చేసిన దేవెగౌడ సలహాలు తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ మధ్యే రెండుసార్లు కేసియార్‌తో మాట్లాడారు. బెంగాల్ గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా మార్చి మూడున నిర్వహిస్తున్న ర్యాలీకి.. కేసియార్ ను కూడా ఆమె ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బిజెపియేతర సియంల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యూపీ ఎన్నికల ఫలితాలను బట్టి బిజెపి వ్యతిరేక కూటమి ప్రయత్నాలు మరింత ఊపందుకునే అవకశాలున్నాయి.