హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ‍్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని ఈ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించారు.. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఈ నెల 5వ తేదీన కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొంతమంది ముస్లిం బాలికలు కోర్టులో సవాల్ చేయడాన్ని, వారు చేసిన ఆరోపణలను తిరస్కరించారు ఏజీ..
Read Also: Telangana: రిజిస్ట్రేషన్ల శాఖ కాసుల వర్షం.. రూ.10 వేల కోట్ల మార్క్ దాటేసి..
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జేఎం ఖాజీ మరియు జస్టిస్ కృష్ణ ఎం దీక్షిత్ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు ఏజీ.. సమానత్వం, సమగ్రత, ప్రజల స్వేచ్ఛకు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారనడం సరికాదని.. ఇది చట్టవిరుద్ధం ఏమీ కాదన్నారు.. ప్రభుత్వ ఉత్తర్వులో హిజాబ్ సమస్య లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు హానికరం కాదు.. ఇది పిటిషనర్ల హక్కులను ప్రభావితం చేయదని పేర్కొన్నారు.. అయితే, తరగతి గదిలో హిజాబ్‌ను అనుమతించాలా వద్దా అని కళాశాలలు నిర్ణయించుకోవచ్చు అని తెలిపారు.. కాగా, డిసెంబర్ చివరి నుండి రాష్ట్రంలో క్లాస్‌రూమ్‌లలో హిజాబ్‌ను నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యవహారం పాకింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది..