Congress leader’s son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్ శివమొగ్గ జిల్లాకు చెందిన వాడు. గురువారం కర్ణాటకలోని 6 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. బెంగళూర్, దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరెలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఐసిస్ తో సంబంధం ఉందని ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది.
Read Also: Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
ఉడిపిలోని బ్రహ్మావర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాజుద్దీన్ షేక్ కొడుకే ఈ రేషాన్ షేక్. తాజుద్దీన్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు. ఈ అరెస్టులు జరిగినప్పటి నుంచి ఉడిపి ప్రాంతంలో తాజుద్దీన్ షేక్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ నేత కొడుకుకు ఐసిస్ లింకులు ఉండటంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తాజుద్దీన్ షేక్ కాంగ్రెస్ కార్యకర్త అని.. అతడిని పార్టీ తొలగిస్తుందా..? లేదా అని కాంగ్రెస్ తన వైఖరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హిజాబ్ నిరసనల సమయంలో కూడా కాంగ్రెస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అధికార కాషాయపార్టీ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. మతపరమైన హత్యల తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో అశాంతికి తాజుద్దీన్ కారణం అని బీజేపీ ఆరోపించింది.