PayCM: కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లక్ష్యంగా చేసుకుని ‘పేసీఎం’ అంటూ ఇటీవల వెలసిన పోస్టర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను ఈరోజు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ జాబితాలో బీకే హరిప్రసాద్, ప్రియాంక్ ఖడ్గే, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితర నేతలు కూడా ఉన్నారు.
కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ’40 శాతం కమీషన్ సర్కార్’ పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వాదనలు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భారీ రాజకీయ తుఫానును ప్రేరేపించాయి. మరోవైపు పేసీఎం పేరుతో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఏకంగా బీజేపీ కార్యాలయానికి పోస్టర్లు అంటించింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. అయితే, సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలతో ఈ ప్రచారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Khosta-2: రష్యన్ గబ్బిలాలలో మరో వైరస్.. ఇది మానవులకూ సోకుతుందట..
పేసీఎం పోస్టర్ వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని ఆయన విమర్శించారు. వాళ్లు చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాధారాలను చూపించలేకపోయారని బొమ్మై మండిపడ్డారు. ఇదంతా పక్కా ప్రణాళికతో చేస్తున్న రాజకీయ దుష్ప్రచారమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, వాటన్నింటిపై దర్యాప్తు జరుగాల్సి ఉన్నదని బసవరాజ్ బొమ్మై చెప్పారు. పీసీఎం క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లు గిట్టనివాళ్లు దురుద్దేశంతో రూపొందించినవని ఆరోపించారు. ఇటీవల కర్ణాటకలో గోడలపై పేసీఎం క్యూఆర్ కోడ్‌తో ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి.దాంతో రాష్ట్రంలోని బీజేపీ సర్కారు బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను అధికార బీజేపీ కొట్టిపారేసింది.