Basavaraj Bommai: ఢిల్లీలో పలు సమావేశాలకు హాజరుకావాల్సిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి శనివారం కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు. తాను కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడ్డానని బసవరాజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. తాను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని.. ఇటీవల, ఇవాళ తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై విజ్ఞప్తి చేశారు. తన ఢిల్లీ పర్యటన కూడా రద్దయిందని ట్వీట్‌లో తెలిపారు.
Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ 3వ సమావేశానికి, నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశానికి బొమ్మై హాజరు కావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా బీజేపీ హైకమాండ్‌తో చర్చించే యోచనలో ఉన్నట్టు బీజేపీ అధికారి ఒకరు తెలిపారు. జులై 25న జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వివిధ శాఖల ప్రతినిధులతో కలిసి బొమ్మై జూలై 25 నుంచి 26 వరకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.