Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
Read Also: Shashi Tharoor: బీజేపీతో సాన్నిహిత్యంపై నోరు విప్పిన శశి థరూర్.. ఏమన్నారంటే..!
‘‘వాస్తవానికి మనం జనాభాను బట్టి ఆలోచించాలి, పట్టణ జనాభాలో ఎక్కువ మంది మైనారిటీలు, పేదలు ఉన్నారు.’’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ రిజర్వేషన్లను సమర్థించారు. ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇతరులకు కేటాయించలేదని, అందుకే ముస్లిం కోటాను 10 నుంచి 15 శాతానికి పెంచామని అన్నారు. మైనారిటీలు చాలా కాలంగా రిజర్వేషన్లు పెంచాలని అభ్యర్థిస్తున్నారని, దీంతో ఖాళీగా ఉన్న భవనాలను నింపే క్రమంలో 15 శాతం కోటా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మంత్రి ఎంసీ సుధాకర్ కూడా సమర్థించారు. కేంద్రం ఇప్పటికే మైనారిటీలకు 15 శాతం కేటాయింపులు చేస్తోందని, దానికి అనుగుణంగా రాష్ట్రం కూడా చర్యలు తీసుకుందని చెప్పారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత(సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ విలువ చేసే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఈ బిల్లును మే 22న కర్ణాటక గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ప్రధాని మోడీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. మతం ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్ మంజూరు చేస్తున్నారని, ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల్ని హరిస్తుందని ఆరోపించారు.