Karnataka Elections: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి కూడా తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. కర్ణాటక రాజకీయాల్లో ఈశ్వరప్పకు 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఎదిగారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా మలిచారు. ఇప్పుడు కూడా ఆయనకే టికెట్ దక్కడం ఖాయమౌతుందనే వార్తలు వెలువడుతున్నాయి.
Read Also: Amit Shah: 2024లో బీజేపీదే అధికారం.. 300కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం..
బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో ఆయన శిష్యుడి, బీజేపీలో నంబర్ 2గా ఉంటోన్న ఈశ్వరప్ప కూడా తప్పుకోవడం కలకలం రేపుతోంది.
‘‘గత 40 ఏళ్లలో పార్టీ నాకు చాలా బాధ్యతలను అప్పగించింది. నేను బూత్ ఇన్‌చార్జి నుండి రాష్ట్ర పార్టీ చీఫ్‌గా మారాను. ఉప ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా నాకు ఉంది’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈశ్వరప్పకు 75 ఏళ్లు నిండాయి. ఎన్నికలలో పోటీ చేయడానికి మరియు పదవులు చేపట్టడానికి నాయకులకు బీజేపీలో అనధికారిక వయోపరిమితిని దాటింది. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు ఈశ్వరప్ప. గతంలో మసీదుల నుంచి అజాన్ ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో వస్తుంటే.. అల్లా చెవిటివాడా..? అని వ్యాఖ్యానించారు. 224 సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి.