Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away: బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ జనతా పార్టీకి తీవ్ర లోటు ఏర్పడింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు. 56 ఏళ్ల మామణి సౌదత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన శనివారం రాత్రి మరణించారు. ఆయనకు ఒక భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ఆస్పత్రిని సందర్శించి మామణికి నివాళులు అర్పించారు.
Read Also: Says Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు చెప్పులు వేసుకోను
మా పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి దేవుడు ఈ నష్టాన్ని భరించే శక్తి ఇవ్వాలని.. ఓం శాంతి అంటూ సీఎం బస్వరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. ఆనంద్ మామణి తండ్రి చంద్ర శేఖర్ మామణి కూడా 1990లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆనంద్ మామణి. మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. బెంగళూర్ మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే అంతకుముందు చెన్నైలో చికిత్స తీసుకుంటున్న ఆయనను డాక్టర్ల సలహా మేరకు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు. శనివారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో మరణించారు. కార్యకర్తలు, అనుచరులు చివరి చూపుకోసం ఆయన భౌతికకాయాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు.