Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంతారా స్టార్ రిషబ్ శెట్టి కూడా బీజేపీకి మద్దతు ఇస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం ఉడిపిలో సీఎం బసవరాజ్ బొమ్మై, రిషబ్ శెట్టి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు ఇద్దరు కలిసి ఉడిపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిద్దరు కలిసి ఆలయంలో కనిపించడంతో కన్నడ నాట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కిచ్చా సుదీప్ లాగే రిషబ్ శెట్టి కూడా మద్దతు ఇస్తారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Laxman Savadi: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం!
ఇదిలా ఉంటే ఈ కలయికపై రిషబ్ శెట్టి స్పందించారు.. ‘నో పొలిటికల్ కలర్’ అంటూ వ్యాఖ్యానించారు. నేరు కొల్లూరు మూకాంబిక దర్శనానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిశానని, దీంట్లో ఎలాంటి రాజకీయ రంగు లేదని, ప్రస్తుతం నాను కాంతారా స్క్రిప్టు రచనలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. మీ అందరి ప్రేమ ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. కాంతారా సూపర్ హిట్ తర్వాత కాంతారా-2 ఉంటుందని ఇప్పటికే రిషబ్ శెట్టి స్పష్టం చేశారు.
కొల్లూరులో సీఎం బొమ్మైని చూసి రిషబ్ శెట్టి కాళ్లకు నమస్కరించారు. బొమ్మై, రిషబ్ శెట్టి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి బొమ్మై ఈ విషయంపై మాట్లాడుతూ.. రిషబ్ కొల్లూరు వచ్చినట్లు నాకు తెలియదు. రిషబ్ నాకు మంచి స్నేహితుడు, అతను మా భావజాలానికి దగ్గరగా ఉన్నాడు, ఎన్నికల ప్రచారం గురించి ఆయనతో మాట్లాడలేదు. ప్రస్తుతం రిషబ్ ను ఉపయోగించుకునే ఆలోచన లేదు అని ఆయన అన్నారు. గతేడాది కాంతారా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. కాంతార-2 ఏప్రిల్ 2024లో ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.