Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని విబేధాలతో పాటు, కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కన్హయ్య కుమార్ బహిరంగంగా ఆప్ నేతలకు, అరవింద్ కేజ్రీవాల్‌కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు.
ఇదిలా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు సొంత పార్టీ నేత ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అతని ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ..‘‘ స్థానిక వ్యక్తి కావాలి, బయటి వ్యక్తి కాదు’’ అంటూ నల్ల పోస్టర్లను ప్రదర్శించారు. కన్హయ్య కుమార్ ఆప్, ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ని ప్రశంసించారని ఆరోపించారు. ‘‘ఈశాన్య ఢిల్లీకి చెందిన అభ్యర్థి కూడా పార్టీకి, కార్యకర్తల నమ్మకానికి విరుద్ధంగా ఢిల్లీ సీఎంని పొగుడుతూ మీడియా బైట్‌లు ఇస్తున్నారు’’ అని చెప్పారని అరవిందర్ సింగ్ లవ్లీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘నవాబుల’’ దురాగతాలను మరిచిపోయాడు.. మన మహరాజులను అవమానించాడు..
నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఆయన లవ్లీ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతల్ని పట్టించుకోలేదని, బయటి వ్యక్తులకు టికెట్ కేటాయించారని అన్నారు. మాజీ జెఎన్‌యూ స్టూడెంట్ యూనిమన్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్‌లో చేరారు. 2019లో సీపీఐ తరుపున బెగుసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, బీజేపీ ఢిల్లీ పరిణామాలపై కాంగ్రెస్‌ని విమర్శిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. సాయుధ బలగాలను అవమానపరుస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. షీలా దీక్షిత్, సోనియాగాంధీలను జైల్లో పెడతామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికికి ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని, మద్యం కుంభకోణంలో ఆప్ ప్రమేయం గురించి కాంగ్రెనస్ ఫిర్యాదు చేసింది, కానీ రాజకీయ కారణాలతో రెండు పార్టీలు ఒక్కటయ్యాయని పూనావాలా అన్నారు.