Kamal Haasan: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా సద్దుమణగడం లేదు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ యాక్టర్, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు.
సనాతన్ అనే పదం పెరియార్ నుంచి వచ్చిందని, ఉదయనిధి కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారని కమల్ హాసన్ శుక్రవారం అన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకు చిన్న పిల్లవాడు ఉదయనిధిని వెంటాడుతున్నారని అన్నారు. పెరియార్ వల్లే సనాతన అనే పదం అందరికి తెలిసిపోయిందని, పెరియార్ తమ వాడని ఏ పార్టీ కూడా చెప్పుకోదని, ఆయన తమిళనాడుకు సొంతమని కమల్ హాసన్ చెప్పారు.
Read Also: USA: బార్‌లోకి అనుమతి నిరాకరణ.. ఐదుగురిని కాల్చి చంపిన మహిళ
ఒకప్పుడు పెరియార్ గుడిలో పనిచేసేవాడని, వారణాసిలో నుదుట తిలకం పెట్టుకుని పూజలు చేస్తుండే వాడని, వాటన్నింటిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించండి అని ఆయన అన్నారు. ఆయన జీవితమంతా ప్రజల సేవతోనే గడిచిందని తెలిపారు.
కమల్ హాసన్ ఇంతకుముందు కూడా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొనడం ఉదయనిధి వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సంకుచిత రాజకీయ భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.
సనాతన వివాదంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు కూటమిని టార్గెట్ చేసింది. ప్రధాని మోడీ నుంచి కేంద్రమంత్రులు దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని తుడిచివేయడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తుందని బీజేపీ ఆరోపించింది.