Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు.
“భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారు…” అని మేఘ్వాల్ ట్వీట్ చేశారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన జస్టిస్ సూర్యకాంత్ దేశ 53వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన 14 నెలల పదవీకాలం ఉంటారు. ఫిబ్రవరి 9, 2027న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు.
Read Also: Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం , స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం ,లింగ సమానత్వంపై ముఖ్యమైన అంశాలపై వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల న్యాయ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వలసవాద కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో ఈయన కూడా
ఉన్నారు. ప్రస్తుత బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన 65 లక్షల పేర్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేుషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని ఆదేశించిన ఘటన కూడా ఈయనదే. సైన్యంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను సమర్థించి, దానిని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు.