Wedding Season: నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని గురువారం ఒక నివేదిక తెలిపింది. 45 రోజుల వ్యవధిలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పింది. ఢిల్లీ 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు సమకూరుస్తుందని CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (CRTDS) అధ్యయనం తెలిపింది.
గతేడాదితో పోలిస్తే వివాహాల సంఖ్య దాదాపుగా మారనప్పటికీ, ప్రతీ వివాహానికి ఖర్చు పెరిగిందని, 75 నగరాల్లో చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్ విభాగం తెలిపింది. 2024లో, 48 లక్షల వివాహాలు రూ.5.90 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. 2023లో 38 లక్షల వివాహాల ద్వారా రూ.4.74 లక్షల కోట్ల ఆదాయం జనరేట్ అయింది. ఈ ఏడాది వివాహాల సీజన్ ప్రభుత్వ పన్ను ఆదాయానికి సుమారు రూ.75,000 కోట్లు దోహదపడుతుందని నివేదిక అంచనా వేసింది.
వివాహ సంబంధిత కొనుగోళ్లలో 70 శాతానికి పైగా ఇప్పుడు భారతదేశంలో తయారు చేసిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ, పాత్రలను, క్యాటరింగ్ వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. చైనీస్ లైటింగ్ వంటి దిగుమతి చేసుకునే వస్తువుల ఉనికి గణనీయంగా తగ్గిందని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ కళాకారులు, వస్త, ఆభరణాల వ్యాపారులు ఆర్డర్లలో పెరుగుదల చూస్తున్నారు. ఈ వివాహ సీజన్ ఏకంగా 1 కోటి కంటే ఎక్కువ తాత్కాలిక, ఉద్యోగాలు సృష్టించనుంది. వివాహాల సీజన్‌లో ఆర్థిక కార్యకలాపాలలో ఆభరణాలు 15 శాతంతో అతిపెద్ద సహకారిగా ఉంటాయని, దుస్తులు- చీరలు 10 శాతం వాటాను అందిస్తాయని CAIT తన అంచనాలో పేర్కొంది.