Justice Lalit will take charge as the CJI of the Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మూడు తరాలుగా యు. యు. లలిత్ కుటుంబం న్యాయవాద వృత్తిలో ఉంది. గతంలో పలు కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. భారత్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా యు. యు. లలిత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రముఖమైన కేసులు ఆయన ముందుకు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే రహస్య ఎన్నికల బాండ్లు, మతం ప్రాతిపదికన పౌరసత్వం వంటి ప్రముఖమైన కేసులు యు. యు. లలిత్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్
యు. యు. లలిత్ కుటుంబం గత మూడు తరాలుగా న్యాయవాద వృత్తిలోనే ఉంది. ఈయన తాత మహారాష్ట్ర షోలాపూర్ లో న్యాయవాది. ఆ తరువాత జస్టిస్ లలిత్ తండ్రి ఉమేష్ రంగనాథ్ లలిత్ కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. ఆయన హైకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం లలిత్ దేశ అత్యున్నత పదవి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు. జస్టిస్ లలిత్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో ఒకరు న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతున్నారు. బార్ కౌన్సిల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన రెండవ వ్యక్తిగా లలిత్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఇలా ఎస్ఎం సిక్రీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
జస్టిస్ లలిత్, ముస్లింలలో తక్షణ ‘‘ ట్రిపుల్ తలాక్’’ కేసులో తీర్పు చెప్పారు. దీంతో పాటు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిల్లల శరీర భాగాలను లైంగిక ఉద్దేశంతో తాకడం కూడా లైంగిక వేధింపులతో సమానమనే తీర్పును ఇచ్చారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూమిహక్కు వివాదంలో విచారణ జరిపిన బెంచ్ లో కూడా లలిత్ ఉన్నారు. 2జి స్పెక్ట్రమ్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. ప్రస్తుతం 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లలిత్ పదవీకాలం ఆయనకు 65 ఏళ్లు నిండిన సమయంలో అంటే నవంబర్ 8న ముగుస్తుంది.