అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది.
Read Also: Flight: ఢిల్లీలో కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన విమానం..
2005-2009 మధ్యకాలంలో మధు కోడా ప్రభుత్వంలో తిర్కీ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.6,28,698 అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.. సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ 2009లో దిగువ కోర్టులో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్ కోర్టు జూలై 1, 2009న విచారణకు ఆదేశించింది. 1 ఆగస్టు 2010లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై కేసు నమోదు చేసింది సీబీఐ. మందార్ ఎమ్మెల్యేగా 2005 నుంచి జూన్ 2009 వరకు రూ.6.28లక్షలు ఆదాయానికి మించి సంపాదించినట్లు తన విచారణలో సీబీఐ తేల్చింది.. ఇక, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు 21 మంది సాక్షులు, డిఫెన్స్ తరఫున ఎనిమిది సాక్షులను హాజరుపరిచారు.. ఇక, ఇవాళ తిర్కీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.. కోర్టు ఆదేశాలపై 62 ఏళ్ల మందార్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. “నేను కోర్టును విశ్వసిస్తున్నాను.. నేను నా లాయర్‌తో మాట్లాడతాను” అని పేర్కొన్నారు.. కాగా, ఇదే కేసులో 2018లో రాంచీ జిల్లాలోని బన్హోరాలో బంధు తిర్కీని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఇక, ఎన్నికల అఫిడవిట్‌లో బంధుత్ తిర్కీ తన ఆస్తులను రూ.60,000 నగదు, కారు చూపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని వసంత్ విహార్‌లో రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. మరోవైపు, జార్ఖండ్ నేతకు వివాదాలు కొత్తేమీ కాదు.. ఇప్పటికే పలు కుంభకోణాలు వెలుగుచూశాయి.