జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించగా…అక్కడ అతను మరణించాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఉగ్రవాదులను వరసపెట్టి ఏరి పారేస్తున్నాయి భద్రతా దళాలు. వరసగా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్లు జరగుతూనే ఉన్నాయి. వీటిల్లో లష్కర్ , జైష్ కు సంబంధించిన కమాండర్ స్థాయి ఉగ్రవాదులను ఆర్మీ తుదముట్టిస్తోంది. దీంతో కాశ్మీర్ లో తమ ఉనికిని బయటపెట్టేందుకు ఏదైనా దాడి చేయాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను తుదముట్టిస్తోంది. గతంలో నాన్ లోకల్స్ పై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వేటాడి వెంటాడి మట్టుపెట్టింది ఆర్మీ, పోలీసులు.
ఈ ఘటనకు పాల్పడినట్లు ఇప్పటికీ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే బుధవారం వరసగా కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 168 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారని.. వారిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 75 మందిని హతమార్చామని ఆర్మీ వెల్లడించింది. వీరిలో 21 మంది పాక్ ఉగ్రవాదులు ఉన్నారు.