Jai Shankar: జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
Read Also: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్‌పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని ట్రంప్ చేసిన వాదనల్ని జైశంకర్ తోసిపుచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడిన సమయంలో తాను కూడా అదే గదిలో ఉన్నానని వెల్లడించారు. ‘‘మే 9 రాత్రి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాని మోడీతో మాట్లాడుతున్న సమయంలో నేను అదే గదిలో ఉన్నాను. పాక్ నుంచి భారత్‌పైకి భారీ దాడి ఉంటుందని చెప్పారు. అయితే, మేము దానిని ఒప్పుకోలేదు. పాకిస్తాన్ బెదిరింపులకు ప్రధాని మోడీ పట్టించుకోలేదు. ప్రధాని మోడీ మా ప్రతిస్పందన చలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు’’ అని జైశంకర్ తెలిపారు.
మే 9 రాత్రి, పాకిస్తా్న్ భారత్‌పై భారీ దాడి చేసిందని, కానీ భారత దళాలు చాలా త్వరితంగా స్పందించినట్లు వెల్లడించారు. తర్వాత రోజు ఉదయం యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాక్ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని జైశంకర్ వెల్లడించారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ కాషిఫ్ అబ్దుల్లా, భారత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ రాజీవ్ ఘాయ్‌కు కాల్ చేసి కాల్పుల విరమణ కోరారని చెప్పారు.