RBI: జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్‌బీఐ భావించింది. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణంగా భావించింది. ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ప్రస్తుతానికి బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు… రెపో (6.5 శాతం) దానినే యధావిధిగా కొనసాగించాలని కమిటీలోని ఆరుగురు సభ్యులైన ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే తమ పని ఇంకా ముగియలేదని, కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ..రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి తాము సిద్ధంగా ఉండాలని.. దానికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోందని దాస్ సమావేశంలో చెప్పారు.
Read Also: Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
ఆర్‌బీఐ పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం ఆర్‌బీఐ గమనించింది. కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్లో 6 శాతం అధిగమిస్తే… దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్ గా పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించాయి. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జులైలో మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51 శాతంగా నమోదయ్యింది. జూన్ నెలలో ఇది కాస్త 4.55 శాతం.. జులై 2022లో ఈ రేటు 6.69 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరలే జులై లో ఏకంగా 37.43 శాతం పెరిగాయి.
Read Also: Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ధరల తీవ్రత పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. కానీ ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతామని కూడా ఆర్‌బీఐ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఈ నెల సమీక్షా సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు.