IndiGo Flights Cancelling: ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఇవాళ్టి వరకు 1000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ మరోసారి స్పందిస్తూ.. ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యానికి క్షమాపణ తెలియజేశారు. కాగా, రేపటి (డిసెంబర్ 6న) వరకు ఈ సంఖ్య వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించారు.
Read Also: Seediri Appalaraju: ఇంగ్లీష్ మీడియం తెచ్చింది మేము.. ఆపింది మీరు!
అయితే, గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఫలించలేదని ఇండిగో సీఈవో ఎల్బర్స్ పేర్కొన్నారు. అందుకే.. అన్ని వ్యవస్థలు, షెడ్యూల్‌లను రీబూట్ చేసేందుకు నిర్ణయించాం.. దాని ఫలితంగా నేడు భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రేపటి నుంచి పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ చర్యలు తప్పనిసరిగా పాటించాల్సిందే.. శనివారం నాటికి 1000 కన్నా తక్కువ సర్వీసులు రద్దు అవుతాయని అంచనా వేస్తున్నాం.. ఎఫ్‌డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) విషయంలో డీజీసీఏ తీసుకున్న రిలీఫ్ చర్యలు చాలా సాయం చేశాయని పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు.
ఇక, ఇండిగో విమానయాన సంస్థ నిత్యం దాదాపు 2,300 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపిస్తుంది. కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ కాగా.. ఈరోజు ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటినట్లు అంచనా వేశారు. సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, షెడ్యూల్ మార్పులు, అప్‌డేట్ చేసిన సిబ్బంది రోస్టరింగ్ నియమాల అమలు లాంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణాలుగా తెలుస్తుంది.