PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్‌కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
‘‘ వారు (కాంగ్రెస్) మొహబ్బత్ కి దుకాన్ నడుపుతున్నట్లు చెప్పుకుంటారు. కానీ మన దేశానికి చెందిన ఒక జర్నలిస్టుపై అమెరికాలో కాంగ్రెస్ క్రూరమైన దాడికి పాల్పడింది. యూఎస్ఏలో భారతదేశ బిడ్డని అవమానించారు. వాక్ స్వాతంత్య్రానికి చాంపియన్లుగా చెప్పుకునే వారు క్రూరత్వంలో మునిగిపోయారు.’’ అని విమర్శించారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభం, ఓ జర్నలిస్టుని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా..? భారత జర్నలిస్టుపై దాడి చేసి భారతదేశ ప్రతిష్టని పెంచుతున్నారా..? రాజ్యాంగం అనే పదం మీ నోటికి తగదా..? అని ప్రధాని కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం.. ఆరోగ్యశ్రీకి రూ.2,500 కోట్ల బకాయిలు..!
ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడాతో డల్లాస్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఇండియా టుడే ప్రతినిధి రోహిత్ శర్మ ఆరోపించారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపడం గురించి శామ్ పిట్రోడాను తాను ప్రశ్నించినప్పుడ, కాంగ్రెస్ బృందంలోని సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసిటన్లు శర్మ తెలిపారు.
30 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, ఇంటర్వ్యూ వీడియో మొత్తం డిలీట్ చేశారని రిపోర్టర్ తెలిపారు. తన అనుమతి లేకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు తన ఫోన్‌ని అన్‌లాక్ చేశారని శర్మ చెప్పారు. ఈ ఘటనపై శామ్ పిట్రోడా స్పందించారు. ‘‘నేను దానిని పరిశీలిస్తాను. ఎవరైనా తప్పుగా ప్రవర్తించడాన్ని నేను ఆమోదించను. జర్నలిస్టులకు గౌరవం ఇవ్వకపోవడాన్ని నేను ఆమోదించను,’’ అని అన్నారు. తాను ఎల్లప్పుడూ జర్నలిస్టులను గౌరవంగా మరియు గౌరవంగా చూస్తానని మరియు “ఫ్రీ ప్రెస్” కోసం నిలబడతానని నొక్కి చెప్పాడు.