కరోనా టీకా పంపిణీలో భారత్ దూసుకుపోతుంది. మిగతా దేశాల కంటే స్పీడ్‌గా టీకా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు. ఇది అనేక మందికి ప్రేరణ అని అన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనవరి 16న దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఆరోగ్య, మున్సిపల్ సిబ్బందికి టీకాలు ఇచ్చారు. తర్వాత ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు, 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందింది. ఇప్పుడు 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. దేశంలో మొదటి పది కోట్ల డోసులు ఇచ్చేందుకు 84 రోజులు పట్టగా.. చివరి పది కోట్లు.. అంటే 40 కోట్ల నుంచి 50కి చేరేందుకు 20 రోజులు మాత్రమే పట్టింది.
కేంద్రమంత్రి అమిత్ షాతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా సమావేశమయ్యారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై వివరించారు. కేంద్రం నుంచి మంచి సహకారం అందుతుందని పూనావాలా చెప్పారు. అంతేకాదు.. నొవావాక్స్ టీకా.. అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇక చిన్న పిల్లలకు 2022 ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు సింగిల్ డోసు కరోనా టీకాను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు జాన్సన్ & జాన్సన్ ప్రయత్నిస్తోంది.
అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా జాన్సన్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ టీకా 66 శాతం సమర్థంగా ఉన్నట్లు ఇప్పటికే తేలింది. సీరియస్ కేసుల్లో మాత్రం 85 శాతం ప్రభావశీలతను చూపినట్లు సంస్థ వెల్లడింది. టీకా వేసిన 28 రోజుల తర్వాత కొవిడ్ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను స్థానికంగా బయోలాజికల్ ఈ కంపెనీ ఉత్పత్తి చేయనుంది.