India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.
పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా జూన్ నెలాఖరులోపు వాణిజ్య రుణాల రూపంలో 3.7 బిలియన్ డాలర్లను రుణంగా ఇస్తామని చెప్పింది. ఇది పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలను రెండంకెలలో ఉంచడానికి సహాయపడుతుంది. దేశ నిర్మాణాన్ని మరిచిపోయిన పాకిస్తాన్ పాలకులు ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయకుండా, దాని సైన్యంపై విపరీతంగా బడ్జెట్ కేటాయించడంతో పాటు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తుండటం గమనార్హం.
ఆర్థికంగా ఎంత తేడా..
భారత్ ఓవైపు పారిశ్రామీకరణ, డిజిటలైజేషన్, గ్లోబల్ ఐటీ సెంటర్‌గా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదం, మతోన్మాదం, భారత వ్యతిరేకతకు కేంద్రంగా మారింది. 2024లో భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటే, పాకిస్తాన్ కేవలం 340 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే, భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా 10 రెట్లు ఎక్కువ. ఇక భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 45వ స్థానంలో ఉంది. భారత తలసరి ఆదాయం 3000 డాలర్లకు పైగా ఉంటే, పాకిస్తాన్ తలసరి ఆదాయం 1500 డాలర్లుగా ఉంది. పాకిస్తాన్ ద్రవ్యోల్బనం రెండంకెల్లో ఉంది. దాని విదేశీ మారక నిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి. ప్రపంచంలోనే భారత వృద్ధి టాప్ ప్లేస్‌లో 6.5 శాతంగా ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 4 శాతం దాటితే గొప్ప.
భారత ఆర్థిక పెరుగుదలకు స్థిరమైన సంస్కరణలు, శక్తివంతమైన ప్రైవేట్ రంగం, స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ మాత్రం పదేపదే చెల్లింపుల సమతుల్యత సంక్షోభాలు, ఆర్థిక-రాజకీయ అస్థిరతలు, టెర్రర్ ఫండింగ్ వంటి వాటితో కుదేలు అవుతోంది. పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత, గత 35 ఏళ్లలో 28 సార్లు బెయిలౌట్ రుణాల కోసం ఐఎంఎఫ్ గడప తొక్కింది.
భారతదేశ వృద్ధి చరిత్ర:
* 1991 ఆర్థిక సంస్కరణలు: భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించింది, సుంకాలను తగ్గించింది, విదేశీ పెట్టుబడులకు తెరతీసింది మరియు లైసెన్స్ రాజ్‌ను రద్దు చేసింది. ఇది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది.
* ఐటీ సేవల్లో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. 2000లో భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ద్వారా లక్షలాది వైట్ కాలర్ జాబ్‌లను సృష్టించింది. ప్రపంచ ఐటీ కేంద్రంగా మారింది.
* జీఎస్టీ మరియు డిజిటల్ ఇండియా: గత దశాబ్దంలో, భారతదేశం వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ), ఆధార్ మరియు యూపీఐ ద్వారా డిజిటలైజ్డ్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారాన్ని మరింత సౌలభ్యంగా మార్చింది.
* మౌలిక సదుపాయాల వ్యయం: రోడ్లు, రైలు, మెట్రో నెట్‌వర్క్‌లు, విమానాశ్రయాలలో మెగా ప్రాజెక్టులు అంతర్గత కనెక్టివిటీ మరియు ఉపాధిని ఉత్ప్రేరకపరిచాయి.
* విదేశాంగ విధానం: భారత్ అన్ని దేశాలతో మిత్రుత్వం కలిగి ఉంది. భారత్ ఒకే సమయంలో అటు రష్యా, ఇటు అమెరికాతో స్నేహం చేస్తోంది. ఇండియా క్వాడ్, బ్రిక్స్, జీ-20లో భాగస్వామిగా ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం:
* పాకిస్తాన్ తన అవకాశాలను క్రమక్రమంగా కొల్పోతూ వస్తోంది. 9/11 దాడుల తర్వాత అమెరికా నుంచి బిలియన్ల నిధులు పొందినప్పటికీ, చైనా,ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం వచ్చిన ఆర్థిక సంస్కరణలను తీసుకురాలేక విఫలమైంది. బదులుగా భారత్‌ని బూచిగా చూపి సైన్యంపై విపరీతమైన ఖర్చు, ఉగ్ర నిధులు ఆ దేశాన్ని దెబ్బ తీశాయి.
* ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ పాకిస్తాన్ లో కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంధన కొరత, ఆవిష్కరణలు లేకపోవడం, ఎగుమతి పోటీతత్వాన్ని కోల్పోవడంతో పాకిస్తాన్ చతికిలపడింది. ఇక విద్య, వైద్య సూచికలు పేలవంగా ఉన్నాయి. పాకిస్తాన్ హ్యూమన్ కాపిటల్ అభివృద్ధి చెందలేదు. ప్రజల అప్పు జీడీపీలో 80 శాతం దాటింది.
* చైనా వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌ని వాడుకుంటోంది. ఒక రుణ ఉచ్చులో ఇరికించింది. చైనా ప్రయోజనాల కోసం పాకిస్తాన్ బలవుతోంది.
*ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, 2023 నాటికి దాని జనాభాలో 39% కంటే ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. గ్రామీణ పేదరికం మరింత తీవ్రంగా ఉంది.
* పాకిస్తాన్ అక్షరాస్యత రేటు 58% చుట్టూ ఉంది, ఇది దక్షిణాసియాలో అత్యల్పంగా ఉంది. మహిళా అక్షరాస్యత రేటు మరింత దారుణంగా ఉంది, ఇది కేవలం 47%. 2022 యూనిసెఫ్ నివేదిక ప్రకారం, పాక్‌లోని 70 శాతం కుటుంబాలకు సురక్షిత మంచినీరు లేదు.
* 2024 చివరి నాటికి, పాకిస్తాన్ యొక్క బాహ్య రుణం USD 133 బిలియన్లకు పైగా పెరిగింది – ఇది దేశ మొత్తం ఆర్థిక ఉత్పత్తి (GDP)లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ. ఈ రుణంపై వడ్డీని చెల్లించడం వల్లే ప్రభుత్వం మొత్తం ఆదాయంలో 43% తినేస్తుంది.