Indian Railways: ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందిస్తామని వెల్లడించింది. అయితే సదరు రైళ్లు రెండు గంటల కంటే మించి ఆలస్యం అయితేనే ఫ్రీ మీల్స్ ఇస్తామని స్పష్టం చేసింది. రైలు ఆలస్యానికి కారణం ఏదైనా ఉచితంగా భోజనం అందిస్తామని భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రీమియం రైళ్లు ప్రయాణికులను సమయానికి గమ్యస్థానం చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇతర కారణాల వల్ల ఆలస్యం జరిగితే ఆ నష్టాన్ని రైల్వేశాఖ భరించాల్సి ఉంటుంది. అందుకే సదరు రైళ్లు రెండు గంటలు కంటే ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైలు సమయాన్ని బట్టి ప్రయాణికులు బ్రేక్ ఫాస్ట్ లేదా మీల్స్ లేదా స్నాక్స్ లేదా డిన్నర్‌ను ఎంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆహారం అందించే బాధ్యతను ఐఆర్‌సీటీసీ నిర్వర్తిస్తుంది.
Read Also: కృష్ణంరాజు ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
1999లో ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి రాగా అప్పటి నుంచి ఈ సంస్థే రైళ్లలో భోజనాలకు సంబంధించిన సదుపాయాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కిచెన్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన నాణ్యతతో భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మీల్స్ ఇచ్చే ట్రేలను బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌తో తయారుచేయిస్తోంది. ఎయిర్‌టైట్ కవర్లలో ఆహారాన్ని సర్వ్ చేస్తోంది. ఇప్పటికే పలు స్టేషన్‌లలో రైల్వే ఫ్లాట్‌ఫారాలపై ఫుడ్ కోర్టులు, ఫుడ్ ప్లాజాలు, ఫుడ్ యూనిట్లను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. దీని కోసం నిబంధనల ప్రకారం షాపుల నిర్వాహకులకు ఐఆర్‌సీటీసీ కాంట్రాక్టులను కేటాయిస్తోంది. కాగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భారతీయ రైల్వేల ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాది రూ.26,721 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.95,486 కోట్లకు చేరింది.