Monsoon: జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించబోతున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4 తేదీన కేరళలోకి ప్రవేశిస్తున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు సాధారణం కంటే 92 శాతం కంటే తక్కువగా రావడంతో దేశంలోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
Read Also: Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..
రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుక అనుకూల పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది. కొన్ని దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య భారత దేశం, నార్త్ ఇండియాలోని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కడం వల్ల ఎల్ నినో ఏర్పడినప్పటికీ.. ఈ సీజన్ లో నైరుతి రుతుపవనాల్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపింది. దేశంలో 94-106 శాతం వర్షాలు కురిస్తే దాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. భారతదేశంలో వ్యవసాయానికి రుతుపవనాలు కీలకం. నైరుతి రుతుపవన కాలంలోనే దేశంలో అధిక శాతం పంటల సాగు ఉంటుంది.