India is a strong counter to Pakistan on Jammu and Kashmir: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భారత్ తరుపున యూఏన్ లో మాట్లాడిన మొదటి కార్యదర్శి మిజితో వినిటో పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్ధాలని భారత్ తిప్పికొట్టిది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో మునిగిపోయిందని భారత్ విమర్శించింది. ఇండియాపై ఆరోపణలు చేయడానికి ఈ అత్యున్నత వేదికను పాకిస్తాన్ ఎంచుకోవడం బాధాకరమని.. పాక్ లో జరుగుతున్న దుశ్చర్యలను దాచేందుకు ఆ దేశం భారత్ పై విమర్శలు చేస్తోందని భారత్ ఆరోపించింది.
1993 ముంబై పేలుళ్లకు కారణం అయిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని.. శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్న పాకిస్తాన్ ఇలాాంటి చర్యలకు పాల్పడుతుందని భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగు దేశంతో శాంతిని కోరకుంటున్నామని చెబుతున్న దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని విమర్శించింది. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు కోరుకుంటున్నట్లు వినిటో అన్నారు.
Read Also: Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన బాలికల బలవంతపు అపహరణ, పెళ్లిళ్ల ఘటనలను ప్రస్తావిస్తూ.. మైనారిటీ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న దేశం ప్రపంచ వేదికపై మైనారిటీల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భారత్ విమర్శించింది. ఉగ్రవాదం ఆగిపోయినప్పుడు మాత్రమే భారత్, పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ తో పాటు అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోందని.. అయితే అది కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం దొరికినప్పడు మాత్రమే అని ఆయన అన్నారు. కాశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వత పరిష్కారం తర్వాతనే భారత్ తో సంబంధాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను మార్చడానికి భారత్ చట్టవిరుద్ధమైన ఏకపక్ష చర్యలకు పాల్పడుతోందని.. ప్రాంతీయ ఉద్రిక్తతలకు భారత్ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.